హుస్నాబాద్ కేసీఆర్ ప్రకటించే అంశాలు ఇవే…….?

ప్రజా ఆశీర్వాద సభ నేడు.

హుస్నాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల తొలి శంఖారావం

వికారాబాద్ న్యూస్. కామ్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల శంఖారావ సభలో వేదికపై వందమంది కూర్చునేలా దానిని నిర్మించారు. గురువారం సాయంత్రానికే వేదిక నిర్మాణం పూర్తయింది. కళాకారుల కోసం ప్రత్యేక వేదిక నిర్మించారు. వేదిక ముందు భారీ బారికేడ్లు ఏర్పాటుచేశారు. సభకు కుడివైపు వీఐపీ గ్యాలరీ, ఎడమవైపు ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేశారు. వేదికకు ఇరువైపులా భారీ సౌండ్ బాక్సులు అమర్చారు. సభాప్రాంగణంతోపాటు పట్టణంలోని పలు వీధుల్లో కూడా సీఎం ప్రసంగం వినిపించేలా మైకులు ఏర్పాటుచేశారు. సభాప్రాంగణానికి వందమీటర్ల దూరంలోనే సుమారు నాలుగెకరాల స్థలంలో హెలిప్యాడ్ సిద్ధంచేశారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాత్రి పది గంటల వరకు సభాస్థలంలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షించారు. పలు సూచనలు చేసి.. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావం బహిరంగసభకు మొత్తం 1,250మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట సీపీ జోయెల్ డెవీస్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు సభావేదికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్‌స్కాడ్, మెటల్ డిటెక్టర్లతో సభాస్థలం మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాలకోసం నాలుగుచోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు మార్గాల నుంచి సభకు వచ్చే వాహనాలకు స్థలాలను ఖరారుచేశారు. సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాల కోసం తిరుమల గార్డెన్ వద్ద, హన్మకొండ వైపునుంచి వచ్చే వాటికి మార్కెట్‌యార్డులో, కరీంనగర్ వైపునుంచి వచ్చే వాహనాలకు చిల్లింగ్ సెంటర్ వద్ద, అక్కన్నపేట నుంచి వచ్చే వాటికి స్తూపం వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు. సభాప్రాంగణంలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలను నెలకొల్పారు. సభకు వచ్చే ప్రతిఒక్కరినీ పోలీసులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి పంపే ఏర్పాటు చేశారు.

భారీగా జనసమీకరణ.

మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వైస్‌చైర్మన్ రాజిరెడ్డి తదితరులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. గత రెండ్రోజులుగా మండలాలు, గ్రామాలవారీగా ఇంటింటికీ తిరిగి సభకు రావాలని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రజలను సభాప్రాంగణానికి తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అసెంబ్లీ రద్దయ్యాక జరిగే తొలిసభ కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి 65వేల మందిని తరలించాలని మొదట్లో అనుకున్నప్పటికీ అంతకంటే ఎక్కుమందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రెండున్నరకు హుస్నాబాద్ సభాస్థలికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. సభ అనంతరం హెలికాప్టర్‌లోనే తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం: మంత్రి హరీశ్‌రావు.
శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే తొలి బహిరంగసభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. గురువారం రాత్రి సభాప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్‌లోనే ప్రారంభించి రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగురవేశామని చెప్పారు. ఈసారి కూడా ఇక్కడినుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని అన్నారు. గత మూడ్రోజులుగా తాజా మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సభాఏర్పాట్లను పకడ్బందీగా చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో గతంకంటే రెట్టింపు మెజార్టీతో సతీశ్‌కుమార్ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. హుస్నాబాద్ పట్టణం నుంచే సుమారు పదివేల మంది పాదయాత్ర ద్వారా సభకు వస్తారన్నారు. చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా పాదయాత్ర ద్వారా సభకు చేరుకుంటారని తెలిపారు. మిగతా గ్రామాల ప్రజలు వివిధ వాహనాల్లో సభకు వచ్చేందుకు స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. కులవృత్తులవారు వారి వేషధారణలతో సభకు రానున్నారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువమంది ప్రజలు సభకు తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతారని హరీశ్‌రావు చెప్పారు.

  • 10
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here